తెలుగు

ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక పోరాట అంతర్జాతీయ కూటమి నిర్మాణం కోసం సోషలిస్ట్, యుద్ధ వ్యతిరేక, వామపక్ష, ప్రగతిశీల వెబ్‌సైట్లకు, సంస్థలకు, కార్యకర్తలకు పిలుపునిస్తూ వరల్డ్ సోషలిస్ట్ వెబ్‌సైట్ ఎడిటోరియల్ బోర్డ్ రాసిన బహిరంగ లేఖ

గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్లు అమెరికా ప్రభుత్వంతో సన్నిహితంగా కుమ్మక్కై సోషలిస్ట్, యుద్ధ వ్యతిరేక, వామపక్ష, ప్రగతిశీల వెబ్‌సైట్లకు ఇంటర్‌నెట్ అందుబాటుపై భారీఎత్తున ఆంక్షలను అమలు చేస్తున్నాయి. యూరప్‌లోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఇలాంటి అణచివేత విధానాలనే రూపొందిస్తున్నాయి. ప్రజలు ఇంటర్‌నెట్లో ఏమి చదవుతున్నారు, రాస్తున్నారు, ఆలోచిస్తున్నారని పర్యవేక్షించడం లక్ష్యంగా గల ఈ నూతన సెన్సార్‌షిప్ వ్యవస్థకు, నిఘా కార్యకలాపాలను తీవ్రతరం చేయడం తోడైంది. ప్రభుత్వం, సైనిక-గూఢచార సంస్థలు, పరిమితస్వామ్య సాంకేతిక కార్పొరేషన్ల ఈ కూటమి కార్యకలాపాలు వాక్‌స్వాతంత్ర్యం తదితర మౌలిక ప్రజాస్వామిక హక్కులకు ప్రమాదకరమైన ముప్పుగా మారాయి. 

"బూటకపు వార్తలను", "రష్యావాళ్ల ప్రభావాన్ని" నిర్మూలించడమనే మోసపూరితమైన ముసుగులో 21వ శతాబ్దపు పెట్టుబడిదారీ పోలీసు రాజ్యపు సాంకేతిక వ్యవస్థను నిర్మిస్తున్నారు.

గూగుల్‌ తన శోధనా ఫలితాలను ఎలా నియంత్రిస్తున్నదో బట్టబయలు చేసే సమాచారాన్ని వరల్డ్ సోషలిస్ట్ వెబ్‌సైట్  2017 వేసవిలో ప్రచురించింది. ఏప్రిల్‌ నుంచి గూగుల్ వామపక్ష సైట్ల ట్రాఫిక్‌ను పరిమితం చేసినట్టు అది తెలిపింది. ఫలితంగా గూగుల్‌లో శోధించడం వల్ల వామపక్ష సైట్లకు చేరే పాఠకులు దాదాపు 70 శాతం తగ్గినట్లు డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ పేర్కొంది. 2017 ఏప్రిల్ వరకు, డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్‌కు ట్రాఫిక్‌ను సృష్టించిన 150 అగ్రస్థాయి సెర్చ్ పదాల్లో 145 పదాలకు గూగుల్ శోధన ఫలితాలు అప్పటి నుంచి ఒక్కసారి కూడా తమ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్‌ను సృష్టించలేదని అది తెలిపింది. గ్లోబల్‌సెర్చ్.కామ్, కన్సార్టియంన్యూస్.కామ్, కౌంటర్‌పంచ్.ఆర్గ్, ఆల్టర్‌నెట్.కామ్, వికీలీక్స్.కామ్, ట్రూత్‌డిగ్.ఆర్గ్ (globalresearch.ca, consortiumnews.com, counterpunch.org, alternet.com, wikileaks.com మరియు truthdig.org) వంటి ఇతర ప్రతిపక్ష వెబ్‌సైట్లు కూడా గూగూల్ శోధన ద్వారా తమకు వచ్చేపాఠకుల సంఖ్య గణనీయంగా తగ్గడమనే సమస్యను ఎదుర్కొంటున్నట్టు డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ పరిశోధనలో తేలింది. 

2017 ఆగస్ట్ 25న డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ అంతర్జాతీయ ఎడిటోరియల్ బోర్డ్ చైర్‌పర్సన్ డేవిడ్ నార్త్ గూగుల్ ప్రధాన కార్యనిర్వాహకులకు ఇలా రాశారు:

‘‘ఈ స్థాయి సెన్సార్‌షిప్ అంటే రాజకీయపరమైన బ్లాక్‌లిస్ట్‌ను తయారుచేయడమే. మీ కంపెనీ నివేదించాలని కోరుకోని వార్తలను అడ్డుకోవడం, మీరు అంగీకరించని అభిప్రాయాలను అణచిపెట్టడమే గూగుల్ సెన్సార్‌షిప్‌కు అనుసరిస్తున్న ఆల్గోరిథం ఉద్దేశమనేది స్పష్టమే. వ్యాపార సంస్థగా గూగుల్‌కు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏవైనాగానీ, ఇలా రాజకీయపరమైన బ్లాక్‌లిస్ట్‌ను తయారుచేయడం చట్టబద్ధమైన పని కాదు. ఇది మీకున్న గుత్తాధిపత్యశక్తిని పూర్తిగా దుర్వినియోగం చేయడమే. మీరు చేస్తున్నది వాక్‌స్వాతంత్యంపై దాడి. అందువల్ల డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్‌ను బ్లాక్‌లిస్టులో ఉంచడాన్ని నిలిపివేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. వివక్షతతో కూడిన మీ నూతన శోధనా విధానాల వల్ల  ప్రతికూల ప్రభావానికి గురైన అన్ని వామపక్ష, సోషలిస్ట్, యుద్ధవ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్లపైన సెన్సార్‌షిప్‌ను విడనాడాలని డిమాండ్ చేస్తున్నాం.’’

గూగుల్ ఈ లేఖకు సమాధానం ఇవ్వలేదు. అయితే, 2017 సెప్టెంబరు 26న ద న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ పరిశోధనా ఫలితాలను వెల్లడి చేసింది. ఆ సందర్భంగా అది గూగుల్ "శోధనా ఫలితాలలో రాజకీయ, లింగ, జాతి లేదా భాషాపరమైన పక్షపాతానికి తావులేకుండా ఉండటానికి హామీ కల్పించేలా తమ శోధనా పద్ధతి (అల్గోరిథం) తీవ్ర పరీక్షకు గురవుతుంది" అని చెప్పుకోవడాన్ని ప్రస్తావించింది. 

ఇదొక పచ్చి అబద్ధం. డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్‌ తొలుత ఈ విషయాన్ని బట్టబయలు చేసినప్పటి నుంచి ప్రభుత్వ – సైనిక – గూఢచార – కార్పొరేట్ సాంకేతికతల కూటమి ప్రపంచస్థాయిలో సాగిస్తున్న తమ సెన్సార్‌షిప్‌ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసింది. ఇది ఎలాంటి దాపరికమూ లేకుండా కనిపిస్తున్న వాస్తవం. 2017 డిసెంబరులో ట్రంప్ ప్రభుత్వం ఇంటర్‌నెట్ తటస్థతను రద్దు చేసింది. అదే సమయంలో జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రభుత్వాలు ఇంటర్నెట్‌లో వాక్‌స్వాతంత్య్రంపై దాడులకు పాల్పడటం మొదలైంది. 2018 జనవరిలో ఫేస్‌బుక్, ప్రత్యేకించి వామపక్ష సైట్లను లక్ష్యంగా చేసుకుని వార్తల అందుబాటును నిరోధించటం కోసం వార్తలను అందించే పద్ధతిలో మార్పులను చేసింది. కార్పొరేట్ సంస్థల కొత్త గొంతును ప్రతిధ్వనిస్తూ ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకెర్బెర్గ్ ఫేస్‌బుక్‌ను వాడేవారు "ఒకరితో ఒకరు మరింత ఎక్కువగా అనుసంధానితులై ఉండేలా, తక్కువ ఒంటరితనాన్ని అనుభవించేలా" చేయడం కోసమే ఈ మార్పులను చేపట్టామని చెప్పారు. 

ప్రజాస్వామ్య హక్కులకు ఎదురవుతున్నఈ ముప్పు విస్తృతమైనదే కాదు, తక్షణమైనది కూడా. 1990లలో ఇంటర్‌నెట్ అభివృద్ధి చెందడం ప్రపంచ సమాచార సంబంధాలు విస్తృతంగా విస్తరించడానికి అవకాశాలను కల్పించింది. కానీ సామాజిక అసమానతలు బద్దలవుతుండటం, ప్రజలలో అసంతృప్తి పెంపొందుతుండటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తీవ్రం కావడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. వీటికి ప్రతిస్పందనగా పెట్టుబడిదారీ దేశాలూ, సమాచారానికి, కృత్రిమ మేధస్సుకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు), సమాచార సాంకేతిక పరిజ్ఞానాలకు యజమానులుగా, వాటిని నియంత్రించేవారుగా ఉన్న కుబేరులైన కొందరు గుత్తాధిపతులూ ఇంటర్నెట్‌ను నిఘా, నియంతృత్వం, వ్యక్తిగత లాభం, యుద్ధాలకు సాధనంగా మారుస్తున్నారు. 

ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక ప్రతిఘటనను నిర్మించడం అనే అంశంపై వరల్డ్ సోషలిస్ట్ వెబ్‌సైట్‌ జనవరి 16న జరిపిన వెబినార్‌కు (ఇంటర్నెట్‌లో జరిగే సెమినార్‌కు) పంపిన ఒక ప్రకటనలో వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ఇలా సరిగానే హెచ్చరించారు:

తమంతట తాము చైతన్యవంతులు కావడంలో, ఇతరులను చైతన్యవంతులను చేయడంలో ప్రజలకుండే సామర్థ్యంలో ఇంటర్‌నెట్ విప్లవాన్ని తీసుకువచ్చింది. దానివల్ల కలిగిన ప్రజాస్వామిక పరిణామం ప్రస్తుతం వ్యవస్థీకృతమై ఉన్న వ్యవస్థలను కూకటివేళ్ల నుంచి కుదిపివేసింది. సామాజికంగా, గూగుల్, ఫేస్‌బుక్‌లూ, వాటికి సమానమైన చైనా సంస్థలూ, కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ఏర్పాట్ల రీత్యా (లాజిస్టికల్లీ), ద్రవ్యపరంగా విలీనమైన నేటి ఉన్నత వర్గాలూ బహిరంగ చర్చను నియంత్రించడానికి పూనుకున్నాయి.

కార్యకర్త, చిత్ర నిర్మాత జాన్ పిల్జర్ డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ వెబినార్‌కు పంపిన మరొక సందేశంలో, శోధనా ఫలితాలను, పద్ధతులను తారుమారు చేయాడాన్ని "తీవ్రమైన సెన్సార్‌షిప్" అని  ఖండిస్తూ, "ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న స్వతంత్ర పాత్రికేయులు ఆవిర్భవించడంతో ప్రపంచవ్యాప్తంగా వెబ్ ముఖ్యమైన విషయాలను వెల్లడించడానికి, సాక్ష్యధారసహిత విశ్లేషణకు అంటే నిజమైన పాత్రికేయతకు ప్రధాన వనరుగా నిలిచింది."

సమాచార గుత్తాధిపత్యాన్ని, యుద్ధం సాగించడానికి తగిన అనుకూల ప్రచార సామర్థ్యాన్ని, విపరీతంగా సంపద పోగుపడటాన్ని, తీవ్ర సామాజిక అసమానతలను సమర్థించుకోవడానికి ఇంటర్నెట్‌ ముప్పు అని పాలక వర్గం గుర్తించింది. నేటి పెట్టుబడిదారీ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛాయుతమైన సమాచార ప్రవాహానికి పొంతన కుదరదు. ఎనిమిది మంది కుబేరులు ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న 360 కోట్ల మంది పేదలకున్నంత సంపదకు యజమానులుగా ఉన్నారు. పెట్టుబడిదారీ దోపిడీకి, సామ్రాజ్యవాద యుద్ధాల గురించిన చర్చకు, సమాచారాన్ని పంచుకోవడానికి,  ప్రపంచవ్యాప్తంగా వాటికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి, రాజకీయంగా సంఘటితం కావడానికి ఇంటర్‌నెట్‌ వేదిక అవుతోందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని నియంత్రిస్తున్న ఈ గుత్తాధిపతుల ముఠా భయపడుతోంది. 

2017లో ప్రపంచవ్యాప్తంగా 380 కోట్ల మంది ప్రజలు ఇంటర్‌నెట్‌ను ఉపయోగించారు. అంటే ప్రపంచ జనాభా మొత్తంలో 52 శాతం. ఇది, 2005లో ప్రపంచ జనాభాలో 16 శాతంగా లేదా 1 కోటి మంది మాత్రమే. 70 శాతానికి పైగా యువతీ యువకులు నేడు ఆన్‌లైన్లో ఉన్నారు, మొత్తంగా 83 కోట్ల మంది. ఒక్క చైనా, భారత్‌లలోనే వారి సంఖ్య 32 కోట్లు. 2012లో 170 కోట్లుగా ఉన్న మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సభ్యత్వాలు 2017 నాటికి 500 కోట్లకు పెరిగాయి. ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికాలలో ఈ సభ్యత్వాలు చాలా ఎక్కువగా పెరిగాయి. ప్రపంచ కార్మికవర్గం నేడు, మునుపెన్నటి కంటే ఎక్కువగా విస్తరించింది, కేంద్రీకృతమైంది, మరింత ఎక్కవగా అనుసంధానమై ఉంది, అంతర్జాతీయంగా మరింత ఎక్కువ సంఘటితంగా ఉంది. దానికి బ్రహ్మాండమైన రాజకీయశక్తి ఉంది.

ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌కు, సమాచార నియంత్రణకు, పోలీసు - రాజ్యపు నిఘాకు సమర్థనగా డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలూ, కార్పొరేట్ మీడియా చేస్తున్న వాదనలు పెద్ద అబద్ధాల గుట్ట. ప్రజాస్వామ్య హక్కులను, చట్టపరంగా నిర్దేశితమైన ప్రక్రియలను నిర్మూలించడానికి అనువైన ఉన్మాదపూరితమైన భయ వాతావరణాన్ని సృష్టించడమే వారి లక్ష్యం.

ఒకప్పుడు అమెరికా సైన్యంలోనూ, ఎఫ్‌బీఐల గూఢచారిగానూ పనిచేసిన క్లింట్ వాట్స్ జనవరి 17న అమెరికా సెనేట్‌లో మాట్లాడుతూ, "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తక్కువ విద్యావంతులైన ప్రజలు నేడు ప్రధానంగా మొబైల్ ఫోన్ల ద్వారా సైబర్‌స్పేస్‌లో ప్రవేశిస్తున్నారు. ఉగ్రవాదులు, నియంతృత్వ ధోరణలు గల ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాల వక్రీకరణల ప్రభావానికి వారు అధికంగా గురవుతుంటారు." 

"తప్పుడు వార్తలకు తావులేకుండా చేయడానికి, ప్రామాణిక వార్తలతో ప్రజలు సంబంధాలు ఏర్పరచుకోవడానికి తోడ్పడే కొత్త మార్గాలను నానాటికి ఎక్కువగా కనుగొంటున్నాము - మేం ఏమి చేయాలని వారు కోరుకుంటున్నారో మాకు తెలుసు" అంటూ సెనేట్‌తో మాట్లాడేటప్పుడు ఫేస్‌బుక్ అటార్నీ మోనికా బెకెర్ ఆర్వెల్లీయ నిరంకుశాధికార భాషను ప్రయోగించారు. 

"నకిలీ వార్తలు" అనే సాకును ఆశ్రయించడం "రష్యన్ జోక్యం" అనే సాకు కంటే తక్కువ మోసపూరితమైనదేమీ కాదు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, కార్పొరేట్ మీడియా ప్రచారకులైన ద న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ (అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్‌ యాజమాన్యంలోనివి) పత్రికలు తరచుగా ప్రతిపక్ష వెబ్‌సైట్లు బూటకపు వార్తలను వ్యాపింపజేస్తున్నాయని ఆరోపిస్తుంటాయి. నిజానికి ఆ పని చేస్తున్నవి, అంటే బూటకపు వార్తలను ప్రచారం చేస్తున్నవి అవే. ఇందుకు.. 2003లో ఇరాక్‌పై దురాక్రమణకు పాల్పడటానికి ముందు ఆ దేశం వద్ద "సామూహిక జన హనన ఆయుధాలు" ఉన్నాయనే బూటకపు వార్తలను అవి ప్రచారం చేయడానికి మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఆ దురాక్రమణ 10 లక్షల మందికి పైగా మరణించడానికి దారితీసింది. శాశ్వత యుధ్ధంలో నిమగ్నమై, ప్రతి ఖండంలోనూ ప్రభుత్వాలను మార్చడానికి సైనిక కార్యకలాపాలను సాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా తన సైనిక బలగాలను మోహరించిన ప్రభుత్వమే "రష్యా జోక్యం" అనే ఎంత మాత్రమూ నిరూపించలేని ఆరోపణలకు పాల్పడుతోంది. అసమ్మతిని నేరంగా చేయడం కోసం, విమర్శనాత్మక అభిప్రాయాలను ప్రచురించడాన్ని దేశద్రోహానికి పాల్పడటానికి సమానమైనదిగా ముద్ర వేయడానికి పాలక వర్గం ఈ కాల్పనికమైన ఆరోపణలను వాడుకుంటోంది. 

సామ్రాజ్యవాద యుద్ధాలతో పాటూ రాజకీయ అణచివేత కూడా సాగడం ఎప్పుడూ జరిగేదే. అమెరికా, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిన తర్వాత కొన్ని వారాలకే కాంగ్రెస్ గూఢచార చట్టాన్ని ఆమోదించింది. సోషలిస్టులను జైలుపాలు చేయడానికి, విప్లవ భావాలుగల వలసదారులకు దేశ బహిష్కరణ విధించడానికి దాన్ని ప్రయోగించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోషలిస్టులు తమ వార్తా పత్రికలను పోస్ట్ ద్వారా బట్వాడా చేయడాన్ని అమెరికా ప్రభుత్వం అడ్డుకుంది. స్మిత్ చట్టం క్రింద ట్రాట్స్కీయిస్టులపై విచారణలు సాగించింది. 1,00,000 మందికి పైగా జపనీయులను నిర్బంధ శిబిరాల్లో బంధించింది. వియత్నాం యుద్ధానికి తీవ్ర  ప్రజా వ్యతిరేకత ఎదురుకావడంతో జాన్సన్, నిక్సన్ ప్రభుత్వాలు అసంఖ్యాకంగా ఉన్న పౌర హక్కుల, వామపక్ష రాజకీయ కార్యకర్తలపై గూఢచర్యం సాగించడం కోసం అపఖ్యాతిపాలైన కోయిన్‌టెల్‌ప్రో (ఇంటెలిజన్స్ కార్యక్రమం – COINTELPRO) కార్యక్రమాన్ని అమలు చేశాయి. 2001 నుంచి డెమొక్రాట్లు, రిపబ్లికన్లు పేట్రియాట్ (PATRIOT), ఫీసా (FISA) చట్టాల ద్వారా సామూహిక నిఘా కార్యక్రమాలను వ్యవస్థితం చేశాయి. రహస్య జైళ్ల వ్యవస్థను సృష్టించారు. "ఉగ్రవాదం"తో పోరాటం ముసుగులో సీఐఏ చిత్రహింసలకు రక్షణను కల్పించారు. 

ప్రజాస్వామ్యశక్తిగా సోషల్ మీడియాకున్న సామర్థ్యాన్ని అమెరికా సైన్యం తమ కార్యకలాపాలకు పెద్ద ముప్పుగా భావిస్తోంది. అమెరికా సైన్యపు యుద్ధ కళాశాల (యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్) 2016 డిసెంబరు 21 నాటి తన వ్యూహాత్మక పత్రంలో ఇలా పేర్కొంది, "సోషల్ మీడియా, సమాచారం (తప్పుడు సమాచారం) వేగంగా వ్యాపించడం వల్ల కలిగే పర్యవసానాలు,  అత్యధికంగా డిజిటలైజ్‌ అయన నగరంలో ప్రగాఢమైనదిగా ఉండవచ్చు.. ఇక్కడ అమెరికాలో, పోలీసులు చేసిన హత్యల వీడియోలు చెప్పుకోదగ్గ నిరసనలకు, రాజకీయ ఉద్యమాలకు దారితీశాయి."

2017 ఏప్రిల్‌లో ప్రచురితమైన మరో పత్రంలో ఈ యుద్ధ కళాశాల, "స్మార్ట్‌ ఫోన్లతో సన్నద్ధమై, తమ ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలను ఇతరులకు తెలియజేయడానికి సుముఖంగా ఉన్న జనం.. జరుగుతున్న ఘటనల వాస్తవ చిత్రాన్ని అప్పటికప్పుడు జన సమూహం మొత్తం ముందూ ఉంచగలుగుతుంది" అని పేర్కొంది.

ఈ ప్రమాదం స్థాయిని తక్కువగా అంచనా వేయకూడదు. డేవిడ్ నార్త్‌తో కలసి డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ వెబినార్‌లో పాల్గొన్న స్వతంత్ర పాత్రికేయుడు క్రిస్ హెడ్జెస్ ఇలా వివరించారు:

ఈ సెన్సార్‌షిప్ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నది. అభ్యంతరకరమైన విషయాలను అందిస్తున్నాయనే ఆరోపణతో సోషల్ మీడియా కంపెనీలకు జర్మన్ ప్రభుత్వం నెట్‌వర్క్ ఎన్విరాన్‌మెంట్ యాక్ట్ కింద జరిమానాలు విధిస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మాక్రోన్ ఇంటర్నెట్‌లోని "నకిలీ వార్తలను" తొలగిస్తామని ప్రతిన బూనాడు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న కారణంగా చెచెన్ రిపబ్లిక్ నియంత రాంజాన్ కాదిరోవ్‌కు ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఆ వెబ్‌సైట్లు తొలగించాయి. కదిరోవ్ కచ్చితంగా హేయమైన నియంతే. కానీ, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ చెప్పినట్టు, ఇది అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియాలోని విషయసారాన్ని సెన్సార్ చేయడానికి సమర్థవంతంగా సాధికారతను కల్పిస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఫేస్‌బుక్ కలసి పనిచేస్తూ పాలస్తీనా కార్యకర్తలకు చెందిన 100 ఖాతాలను తొలగించింది. ఇది ఆలోచనలపై పోలీసుగిరి, "కొత్తమాట", "ఆలోచనాపరమైన నేరం"తో కూడిన ఒక ఆర్వెలీయ ప్రపంచం దిశగా, లేక ఫేస్‌బుక్ పిలవడానికి ఇష్టపడే "డి-ర్యాంకింగ్", "కౌంటర్ స్పీచ్"ల దిశగా సాగుతున్న యాత్ర.  [Truthdig.com, 2018 జనవరి 21]

మౌలిక ప్రజాస్వామ్య హక్కుల మనుగడకే వాటిల్లుతున్న ఈ ముప్పును ప్రతిఘటించి తీరాలి. ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్, నిఘాలకు వ్యతిరేకంగా సువిశాలంగా సంఘటితం కావడం, సమన్వయం కావడం ఇందుకు అవసరం. ఈ లక్ష్యంతోనే సోషలిస్ట్‌, యుద్ధ వ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్ల అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయడం కోసం వరల్డ్ సోషలిస్ట్ వెబ్ సైట్ చొరవ చూపుతోంది.  

ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకించడమనే ఈ ప్రత్యేక ప్రయోజనం కోసం కూటమిని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్న సోషలిస్ట్‌, యుద్ధ వ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్లు, వ్యక్తిగత కార్యకర్తలు, పాత్రికేయుల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది. 

ఏదేమైనా సోషలిస్ట్‌, యుద్ధ వ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్ల అంతర్జాతీయ సమన్వయానికి కొన్ని నిర్దిష్ట సూత్రాలపై ఆమోదం ఉండటం అవసరం. ఆ సూత్రాలలో ఇవి ఉండాలి:

 • ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకోవడం ఒక హక్కు. ఉచితంగా, సమానంగా అది అందరికీ అందుబాటులో ఉండి తీరాలి అనే మార్గదర్శక సూత్రం ప్రాతిపదికపై, రాజకీయంగా సంఘటితం కావడానికీ, సమాచారం, సంస్కృతి, వైవిధ్యభరితమైన వివిధ దృక్కోణాలు స్వేచ్ఛగా మార్పిడి జరగడానికీ వేదికగా ఇంటర్‌నెట్‌ను పరిరక్షించుకోవాలి.
 • ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల నియంత్రణ నుంచి ఇంటర్‌నెట్‌కు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలని రాజీకి తావులేని విధంగా పట్టుబట్టాలి. 
 • ఇంటర్‌నెట్ తటస్థతకూ, ఉచితంగా, ఏ నిర్బంధాలూ లేకుండా, అది అందరికీ అందుబాటులో ఉండటానికీ బేషరతు మద్దతును తెలపడం. 
 • మనుషులను అంచనావేసే, వెబ్‌సైట్లు బహిరంగంగా కనిపించడాన్ని అడ్డుకునే వాటితోసహా అన్ని శోధనా పద్ధతులను, క్రమాలను ప్రభుత్వాలు, కార్పొరేట్లు తారుమారు చేస్తుండటాన్ని నిషేధించి, అది చట్టవిరుద్ధమని ప్రకటించాలి. 
 • వెబ్ వినియోగదార్లపై నిఘా కోసం ఇంటర్నెట్‌ను, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించడాన్ని రాజీ లేకుండా వ్యతిరేకించడం. 
 • జులియన్ అస్సాంజ్, ఎడ్వర్డ్ స్నోడెన్లపై వేధింపు చర్యలకు ముగింపు పలికి, వారి వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం. 
 • కార్పొరేట్ ఇంటర్‌నెట్ గుత్తాధిపత్య సంస్థలను ప్రైవేటు లాభాలు అందించేవిగా కాకుండా.. అంతర్జాతీయ సమన్వయంతో కూడిన ప్రజాస్వామ్య నియంత్రణలో అత్యున్నత నాణ్యతగల సేవను అందించడమే లక్ష్యంగా గల ప్రజా సంస్థలు (పబ్లిక్ యుటిలిటీస్)గా మారేందుకు కృషి చేయటం. 
 • ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం జరిపే పోరాటం పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, వారి ప్రయోజనాలకు తోడ్పడే రాజకీయవేత్తలకు చేసే విజ్ఞప్తుల ద్వారా సాగేది కాజాలదు. వారికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించడం ద్వారా మాత్రమే అది సాగుతుంది. పైగా, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ పోరాటం జాతీయ ఉన్మాదం, జాత్యహంకారం, సామ్రాజ్యవాద సైనికీకరణ ఏ రూపంలో వ్యక్తమైనాగానీ, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 
 • అందువలన, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు నిజంగానే కట్టుబడి ఉన్నవారు సకల దేశాల శ్రామిక వర్గ సమీకరణ దిశగా తమ ప్రయత్నాలను ఎక్కుపెట్టాలి. 

ఈ సూత్రాలకు అనుగుణంగా, ఈ అంతర్జాతీయ కూటమి క్రింది ఆవశ్యక కర్తవ్యాలను చేపట్టాలి:

 • ప్రభుత్వం, కార్పొరేట్ల ఇంటర్‌నెట్‌ సెన్సార్‌షిప్‌ను లిఖితపూర్వకంగా బహిర్గతం చేస్తూ ఇంటర్‌నెట్‌లో పోస్టింగ్‌లు చేయడంతో సహా అందుబాటులో ఉన్న అన్ని రకాల సోషల్ మీడియా సాధనాల ద్వారా కరపత్రాలు, బ్రోచర్లు, చిన్న పుస్తకాలను ముద్రించి విస్తృతంగా పంపిణీ చేయడం ద్వారా క్రమబద్ధమైన ప్రచారాన్ని పెంపొందింపజేయడం. 
 • వ్యాసాలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, గ్రాఫిక్స్ తదితర విషయాలను ఒకరితో మరొకరు పంచుకోవడం, ఇంటర్‌నెట్‌ వాక్‌స్వాతంత్యానికి ఎదురవుతున్న ముప్పు గురించిన అవగాహనను పెంచడం. 
 • ఇంటర్‌నెట్‌ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక పోరాటంపై పని స్థలాలలో, నివాస ప్రాంతాలలో, పాఠశాలల్లో సమావేశాలను నిర్వహించడం, చర్చా బృందాలను ఏర్పాటు చేయడం. 
 • సెన్సార్ అధికారులు, ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న వెబ్‌సైట్లు, బృందాలు, వ్యక్తుల రక్షణ కోసం, అందుకోసం ప్రచారం సాగించడం కోసం సమైక్యంగా వనరులను సమీకరించడం. 

ఈ కుటమికి సంబంధించిన సూత్రాలు, కర్తవ్యాలపై అంగీకారానికి రావడం, ఇంటర్‌నెట్‌ను సెన్సార్ చేయడానికి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడానికి ప్రభుత్వాలు, కార్పొరేషన్లు చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రతిదాడిని పెంపొందింపజేయడానికి సమర్థవంతమైన ప్రారంభ స్థానం అవుతుంది. 

ఈ సోషలిస్ట్‌, యుద్ధ వ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్ల అంతర్జాతీయ కూటమిలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు, పలు రాజకీయ సమస్యలపై విరుద్ధ భావాలు అనివార్యంగానే ఉంటాయి. ఈ కూటమిలో భాగస్వాములు కావడానికి ఒకే రాజకీయ పంథాను అంగీకరించాల్సిన అవసరమేమీ లేదు. భాగస్వాములైన వెబ్‌సైట్లు, సంస్థలకు తమ స్వతంత్ర కృషిని కొనసాగించే స్వేచ్ఛ ఉంటుంది. 

ఇతర సంస్థల విధానాలు ఎలా ఉండాలో ఆదేశించాలని వరల్డ్ సోషలిస్ట్ వెబ్ సైట్ కోరుకోదు. అలాగే మేం కూడా సూత్రబద్ధం కాని రాజీ కోసమని మా సోషలిస్టు రాజకీయ దృక్పథంపై ఎటువంటి పరిమితులనూ అంగీకరించం. 

ఇంటర్‌నెట్‌లో ఫోర్త్ ఇంటర్నేషనల్‌ ఇందుకు విభాగంగా ఉన్న వరల్డ్ సోషలిస్ట్ వెబ్ సైట్  తన మార్క్సిస్ట్, సోషలిస్టు కార్యక్రమాన్ని, విధానాలను, విశ్లేషణను పెంపొందిచుకునే పనిని కొనసాగిస్తూనే ఉంటుంది. సాంకేతిక గుత్తాధిపత్య సంస్థల స్వాధీనానికి, ఇంటర్నెట్‌పై అంతర్జాతీయ, ప్రజాస్వామ్య నియంత్రణను నెలకొల్పడానికి మద్దతును సమీకరించడానికి మేం కృషి చేస్తాం. వాక్ స్వాతంత్ర్యాన్ని, సకల ప్రజాస్వామిక హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవడానికి సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడటం, పెట్టుబడిదారీ వ్యవస్థకు స్వస్తి పలికి సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం అవసరమనేది డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ అవగాహన.

ఈ పోరాటంలోకి కార్మికవర్గాన్ని ఏ మేరకు సమీకరించగలిగితే అంత విజయవంతంగా.. శక్తివంతమైన పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, బ్రహ్మాండమైన అంతర్జాతీయ కార్పొరేషన్లు సాగించే ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ను ప్రతిఘటించగలమని డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్ నొక్కి చెబుతుంది. కార్మికవర్గం తన వర్గ ప్రయోజనాలైన జీవన ప్రమాణాలు, పని పరిస్థితులు, వేతనాలు తదితరాలను పరిరక్షించుకోవడం కోసం చేసే పోరాటానికి, ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసే పోరాటానికి మధ్య విడదీయరాని సంబంధం ఉన్నది. ఈ విషయంపై కార్మిక వర్గంలో అవగాహనను కలిగించడం చాలా కీలకమైనది. ప్రత్యామ్నాయ వార్తలు, సోషల్ మీడియాలు అందుబాటులో లేకపోతే వివిధ దేశాల్లోని కార్మికులు తమ సాధారణ పోరాటాలను సమర్థవంతంగా సమన్వయించుకోలేరు. సోషలిజం, ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం చేసే అంతర్జాతీయ పోరాటానికి ఇంటర్నెట్‌ నిర్నిరోధంగా అందుబాటులో ఉండటం దోహదపడుతుంది. ఇంటర్‌నెట్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో కీలకమైన భాగంగా సెన్సార్‌షిప్‌ వ్యతిరేక పోరాటానికి కార్మికవర్గం ఉత్సాహంగా మద్దతు ఇస్తుందని వరల్డ్ సోషలిస్ట్ వెబ్ సైట్ విశ్వసిస్తోంది. ఇది వారి పోరాటం. అంటే కేవలం వాక్‌స్వాతంత్ర్య పరిరక్షణ కోసం జరిగే పోరాటంలోకి కార్మిక వర్గాన్ని భాగం చేయడం మాత్రమే కాదు. అందుకు బదులుగా వాక్‌స్వాత్రంత్ర్య పరిరక్షణ కార్మకవర్గానికి ముఖ్యమైనది. కూటముల్లో పనిచేసేటప్పుడు, చర్చలు సాగించేటప్పుడు మనం ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక పోరాటానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని, విప్లవకర సోషలిస్టు వైఖరిని అంగీకరించాలని ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నిస్తాం. 

యుద్ధ వ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్ల అంతర్జాతీయ కూటమి సాగించే కృషిలో భాగస్వాములు కావాలని సోషలిస్ట్, యుద్ధవ్యతిరేక, ప్రగతిశీల వెబ్‌సైట్లు, సంస్థలు, కార్యకర్తలు అందరినీ వరల్డ్‌ సోషలిస్ట్ వెబ్‌సైట్ కోరుతోంది, ఆహ్వానిస్తోంది. 

ఈ కూటమిలో చేరడానికి ఆసక్తి ఉన్న వెబ్‌సైట్లు లేదా సంస్థల ప్రతినిధులు తమ సందేహాలను తీర్చుకోవడానికి endcensorship@wsws.org ను సంప్రదించవచ్చు. ఈ కూటమి కృషిలో బాగస్వాములు కావాలని కోరుకునే వ్యక్తులు దిగువ దరఖాస్తును సమర్పించాలి.

Loading