తెలుగు

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న రవాణా కార్మికులపై పోలీసు హింస, 5,000 మందికి పైగా అరెస్టు

48,000 మంది తెలంగాణ రాష్ట్ర  రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు  ఐదు వారాలుగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు నాయకత్వం వహిస్తున్న కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నాయకులతో సహా 5,000 మందికి పైగా కార్మికులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం"ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి" (“preventive custody”) తీసుకుంది.  కేసీఆర్‌గా సుపరిచితులైన నిరంకుశ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)  రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు అనుకూలమైనది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని 16వ శతాబ్దం కాలంనాటి సుప్రసిద్ధ కృత్రిమ సరస్సు"ట్యాంక్ బండ్" వద్ద శనివారం భారీ ప్రదర్శనను నిర్వహిస్తామని జేఏసి ముందుగానే ప్రకటించింది. ఆ ప్రదర్శనలో కార్మికులు పాల్గొనకుండా నిరోధించడం కోసం  కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రమంతటా రవాణా కార్మికులపైన పోలీసుల దాడులు, మూకమ్మడి అరెస్టులు జరపాలని ఆదేశించింది.

కార్మికులపై దాడికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి, కార్మికుల ప్రదర్శనకు అనుమతిని నిరాకరించాలని పోలీసులకు నిర్దేశించారు. ఇది, వాక్ స్వాతంత్ర్యం, సమావేశ స్వేచ్ఛ అనే కార్మికుల ప్రజాస్వామిక హక్కులపైన బాహాటంగా దాడి చేయడమే. ఈ ప్రదర్శన"ప్రజల అసౌకర్యానికి," "శాంతిభద్రతల సమస్యలకు" కారణమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.

ఆగ్రహం చెందిన వందలాది మంది కార్మికులు నిషేధాన్ని ధిక్కరించి మరీ ప్రదర్శన జరిగే ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో, పోలీసు బృందాలను ఏర్పాటు చేసి లాఠీలతో కార్మికులను తీవ్రంగా కొట్టారు. పోలీసుల దెబ్బలకు పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు, కొందరు కుప్ప కూలిపోయారు.

స్టాలినిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), హిందూ మతతత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా ఇతరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి స్వీయ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవాలనే స్వార్థంతో ఈ నాయకులు కార్మికుల మద్దతుదారులుగా నటిస్తున్నారు.

టిఎస్ఆర్టీసీ డ్రైవర్లు, బస్ కండక్టర్లు, మెకానిక్కులు తదితర కార్మికులు ఉద్యోగ భద్రత కోసం, దయనీయమైన వేతనాలు, పని పరిస్థితులలో గణనీయమైన మెరుగుదల కోసం  సాగిస్తున్న పోరాటంలో భాగంగా అక్టోబర్ 5 నుండి సమ్మె చేస్తున్నారు. తాజాగా, నవంబర్ 5 నాటికి తిరిగి విధులలో చేరాలని లేకపోతే వెంటనే ఉద్యోగాల నుంచి తొలగింపుకు గురవుతారని కేసీఆర్ రెండవ సారి తుది హెచ్చరికను జారీ చేశారు. ఆ హెచ్చరికను కూడా ధిక్కరించి కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

సమ్మె ప్రారంభమైన రోజునే, ముఖ్యమంత్రి ఆ రోజు సాయంత్రం 6 గంటలలోగా కార్మికులు తిరిగి విధులలో చేరకపోతే, వారిని ఇక "ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాలలోకి తీసుకునేది లేదు," అని హుకుం జారీ చేశారు.

వేతనాలను కోల్పోవడం వలన కార్మికులు, వారి కుటుంబాలు ఎనలేని కష్టాలకు గురవుతున్నా, ఇంతవరకు వారు కేసీఆర్ బెదిరింపులను ధిక్కరిస్తూనే ఉన్నారనేది వాస్తవం. ఇది, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ శక్తులకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది.

కార్మికులు, తమ జీతభత్యాలు, పని పరిస్థితులను మెరుగు పరచాలని కోరుతూ 26 డిమాండ్లను టిఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ముందుంచారు. అయితే, టిఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించడమనేదే ప్రధాన సమస్య. జనాభాలో అత్యధికం భాగం ఆధారపడి ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు.  ఇటీవల కొద్ది సంవత్సరాలుగా,నిర్వహణ, ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల కొరతతో టిఎస్‌ఆర్టీసీ సంస్థ అల్లాడిపోయే పరిస్థితిని కల్పించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రావాణా సంస్థను నష్టాలు, పెరిగిపోతున్న అప్పుల విష వలయంలోకి నెట్టేసింది.

నవంబర్ 2 న, కేసీఆర్ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరిపిన తరువాత, 10,400 టిఎస్ఆర్టీసీ మార్గాల్లో 5,100ను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు.

నేడు టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న దుస్థితినే భారతదేశ వ్యాప్తంగా ఉన్న  ప్రభుత్వ యాజమాన్యంలోని రోడ్డు రవాణా సంస్థలన్నీ ఎదుర్కొంటున్నాయి.  స్టాలినిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ (సీపీఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వ పాలనలోని కేరళ రాష్ట్రంలో, రోడ్డు రవాణా కార్మికులు సకాలంలో వేతనాలను చెల్లించాలని కోరుతూ నవంబర్ 4 న 24 గంటల సమ్మెకు దిగారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన స్టాలినిస్ట్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ సందర్భంగా చూపిన ప్రతిస్పందన కూడా కార్మికులపై దాడి చేయడమే. "పని చేయకపోతే, వేతనం లేదు" విధానాన్ని అమలు చేయడానికి ఆయన  కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (కెఎస్‌ఆర్టీసీ) అనుమతించారు. ఇంతకూ కార్మికులు కోరుతున్నది జీతాల చెక్కులు, ఇతర భత్యాలను సకాలంలో చెల్లించాలని మాత్రమే.

 కేసీఆర్ నిరంకుశ పద్ధతులు, టిఎస్ఆర్టీసీని రాష్ట్ర స్థాయిలో ప్రైవేటీకరించడానికి ఆయన చేపట్టిన కృషి జాతీయ స్థాయిలో బీజేపీకి చెందిన, హిందూ ఆధిపత్యవాద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు సమాంతరంగా సాగుతున్నవే. ముస్లింలు అధికంగా ఉన్న ఏకైక రాష్ట్రమైన జమ్మూ-కాశ్మీర్‌కు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక హోదాను  ఈ ఏడాది ఆగస్టులో, మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా రద్దు చేసింది.

కార్మికుల నుండి మరింతగా లాభాలను పిండి, భారత ఉన్నత వర్గాలను మరింత సంపన్నవంతం చేయాలని మోడీ, ఆయన మితవాద మంత్రివర్గం ఏక మనస్కతతో ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజ సంస్థల ప్రైవేటీకరణ కోసం ప్రయత్నిస్తున్నాయి,   

గత జనవరిలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. ప్రజా రవాణా సంస్థలన్నిటినీ ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ బహిరంగంగానే ప్రోత్సహించారు. ఈ అత్యవసర సేవలకు నిధులు సమకూర్చడానికి అయ్యే వ్యయాన్ని భరించే "స్తోమత" ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. దైనందిన రాకపోకలను, సుదూర ప్రయాణాలను సాగించడం కోసం భారత ప్రజలు నేడు సాపేక్షికంగా చవకగా ఉన్నరోడ్డు రవాణాపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నారు.

టిఎస్‌ఆర్టీసీ కార్మికులు గొప్ప ధైర్యాన్ని, దృఢసంకల్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, పనికి మాలిన జేఏసీ ట్రేడ్ యూనియన్ నాయకత్వం కారణంగా సమ్మె చాలా ప్రమాదంలో ఉంది. ఈ నేతలు, భారత కార్మికవర్గానికి అత్యంత బలమైన శత్రువైన మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

శనివారం నాడు జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అది, "మిలియన్ మ్యాన్ మార్చ్" అని పిలిచింది.2011 లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న కేసీఆర్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ కమిటీ కూడా ఇలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ  "మిలియన్ మ్యాన్ మార్చ్"ను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ ప్రాంతాన్ని వేరు చేయడం ద్వారా   2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారింది.

ప్రస్తుత టిఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు, స్టాలినిస్ట్ సీపీఐ, సీపీఎంలతో పాటు కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వమని తెలంగాణ కార్మికులను ప్రోత్సహించారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే వారి జీవితాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు.

టిఎస్‌ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ కఠినంగా వ్యవహరించడం, విస్తృత సామాజిక సంఘర్షణకు దారితీస్తుందని తెలంగాణ హైకోర్టు ఆందోళనను వెలిబుచ్చింది. ఆ కారణంగా అది, నవంబర్ 2న, 5,100 మార్గాలను ప్రైవేటీకరించడానికి కేసీఆర్  చేపట్టిన చర్యను అడ్డుకుంది. తదుపరి విచారణ జరిగే నవంబర్ 11 లోగా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో, హైకోర్టు తమ పక్షాన ఉన్నదనే భ్రమలు కార్మికులలో మొలకెత్తేలా చేయాలని జేఏసీ ప్రయత్నిస్తోంది. భారత న్యాయస్థానాలు ఎల్లప్పుడూ కార్మికవర్గం పట్ల క్రూరంగానే ఉంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రమైన హరియాణా  హైకోర్టు 2017 మార్చి నెలలో అమాయకులైన  13 మంది మారుతి సుజుకి ఆటో కార్మికులకు, వారిపై మోపిన తప్పుడు హత్య ఆరోపణలకు గానూ జీవిత ఖైదును విధించినప్పుడు ఇది సుస్పష్టంగా బహిర్గతమైంది.